NewsPolitics

విభజన చేసి బిజెపి విజయం సాధించాలని చూస్తోంది-గుజ్జ సత్యం బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు.

దేశాన్ని ప్రాంతాలవారీగా రాజకీయ విభజన చేసి, తద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తున్నదని, దాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రధాని మోడీ మీడియాకు లీకుల్ని విడుదల చేసి ప్రాంతాల మధ్య రాజకీయ వైరాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని. జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆరోపించారు. జనాభా ప్రాతిపదికగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలో స్థానాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. చట్టసభల్లో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గి, అన్నింటికీ కేంద్రాన్ని ‘దేహీ’ అని అడుక్కోవాల్సిన దుస్థితి దాపురిస్తుందన్నారు. తమ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎంపీ స్థానాలు పెరుగుతాయనే అంచనాల్లో రాజకీయపార్టీలు, నేతలు మునిగిపోయారన్నారు. దక్షిణాది రాష్ట్రాలు మాత్రం పునర్విభజన ప్రక్రియ విధానాన్ని తప్పు పడుతున్నాయన్నారు. దేశానికి అగ్రభాగ ఆదాయాన్ని అందిస్తున్న తమకు చట్టసభల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వకుంటే సహించేది లేదని చెప్పకనే చెప్తున్నాయని అన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న బీజేపీ దక్షిణాదిలో తమకు ఉనికి లేదని పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టేనని ప్రచారం జరుగుతున్నదన్నారు. అయితే ఢిల్లీలో మహిళా రెజ్లర్ల ఆందోళన తీవ్ర స్థాయికి చేరి, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందన్నారు.

దీనిపై అంతర్జాతీయ రెజ్లర్ల సంఘం కూడా స్పందించి ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం రాజకీయంగా మోడీ సర్కారను ఇరుకున పెట్టిందన్నారు. రాజకీయ పార్టీలన్నీ ఏకమై దానిపై తీవ్రంగా స్పందిస్తున్నాయన్నారు. ఈ అంశాన్ని పక్కదారి పట్టించి, మరో రాజకీయ చర్చను తెరపైకి తెచ్చేందుకే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతుందని అన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలో 84 శాతం సీట్లు, దక్షిణాదిలో 42 శాతం సీట్లు మాత్రమే పెరుగుతాయన్నారు. దీన్నే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు తప్పు పడుతున్నాయన్నారు. ఈ సీట్ల సంఖ్య 2026 నాటికి పెరిగినా, ప్రస్తుత రాజకీయ నిర్ణయం 2024 లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని విశ్లేషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *