NewsPolitics

బీసీ కుల గణన, మంత్రిత్వ శాఖపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలి – గుజ్జ సత్యం

రేపు హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ బీసీల కుల గణన, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ, మహిళా బిల్లులో బీసీ కోట, ఇతర బీసీ డిమాండ్లపై ప్రకటన చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేసారు. ఆయన కాచిగూడలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్లు జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించకుండా మోసం చేశాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 23 మంది బీసీలకు టికెట్లు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు సీట్లు బీసీలకు కేటాయించాల్సి ఉండగా 20 మందికి మాత్రమే టికెట్లు ఇచ్చిందని, అందులో 6 పాత నగరానికి చెందిన స్థానా లను ఇచ్చి మోసగించిందని ఆరోపించారు.

బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని, అయితే నగరంలో బీసీ గర్జన సభకు వస్తున్న ప్రధాని మోదీ బీసీ కుల గణన, మంత్రిత్వ శాఖపై , ఇతర బీసీ డిమాండ్లపై ప్రకటన చేయాలని అన్నారు. లేదంటే ఈ నెల 10న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. దేశంలో పలు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అవుతున్నా, కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే బీసీలను అణచివేశారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సైతం బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌటుపల్లి సురేశ్, తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, గ్రేటర్ ఉపాధ్యక్షుడు పండరినాథ్, జయరాజ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *