News

చలో పద్మశాలి రాజకీయ శంఖారావం వేలాదిగా తరలిరండి – గుజ్జ సత్యం గౌరవాధ్యక్షులు చేనేత కార్మిక సంక్షేమ సంఘం

Rs. 1,08,000/- చెక్కును అందజేస్తున్న గుజ్జ సత్యం.

హైదరాబాద్, సెప్టెంబర్ 01 : ఈనెల 3 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన పద్మశాలీ రాజకీయ శంఖారావం సదస్సుకు ఇంటికొక్కరు చొప్పున కదలి రావాలని రాష్ట్ర చేనేత కార్మిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు. పంచాయతీ నుండి పార్లమెంటు దాకా రాజకీయ వాటా సాధిద్దాం అనే నినాదంతో భారీ ఎత్తున సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. పద్మశాలీల రాజకీయ, ఆర్థిక, సామాజిక వాటా కోసం అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న “పద్మశాలి శంఖారావం” బహిరంగ సభకు, సభా స్థలం దాతగా రూ.1,08,000/- అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ రావుకి అందజేశారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి దాకా అన్ని స్థానాల్లోనూ పద్మశాలీలలకు దామాషా ప్రకారం సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకే మద్దతు ఇస్తామన్నారు. పద్మశాలీల కన్నా ఎక్కువ సంఖ్యలో ఇతర బీసీ కులాల వారు ఉన్నచోట తోటి బీసీలకు అవకాశం ఇచ్చే పార్టీలకే మద్దతు ఇస్తామన్నారు. పద్మశాలీల ఐక్యత వల్లనే, సమైక్య రాజకీయ శక్తి నిర్మాణం వల్లనే మనకు రాజ్యాధికారం లభిస్తుందని గుర్తించాలన్నారు. అధికారం ఒకరిస్తే వచ్చేది కాదు, మన సమైక్య శక్తి వల్ల మనం తెచ్చుకుంటేనే వస్తుందని గ్రహించాలన్నారు. చేనేత పై జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ పూర్తిగా భరించాలన్నారు. చేనేత కార్మికుల వ్యక్తి గత రుణాలు లక్ష రూపాయలు వరకు మాఫీ చేయాలన్నారు. చేనేత నేత కార్మికులకు నెలకు 200 యూనిట్ ల వరకు కరెంటు చార్జీలు మాఫీ చేయాలన్నారు. తెలంగాణ లోని చేనేత సహకార సంఘాల కాష్ క్రెడిట్ లోన్ లు, బ్యాంకు లోన్ లు పూర్తిగా మాఫీ చేయాలన్నారు. పద్మశాలి కుల యువకులకు పని చేసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల వరకు సహాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిపించాలన్నారు.

చలో హైదరాబాద్ సభలో బల ప్రదర్శన రాజ్యాధికారానికి మైలురాయి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్రంగా పోటీ చేసి అయినా మన ఓట్లు మనమే వేసుకుని గెలిచి నిలిచి రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించాలన్నారు. పద్మశాలీలకు సంక్షేమంతో పాటు రాజకీయ వాటా సాధన లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలే కాక దేశ వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు సంఘటితమై సభకు వేలాదిగా తరలి రావాలని అన్నారు. ఈ సభకు వివిధ రాజకీయ పార్టీలలో పని చేస్తున్న పద్మశాలి నాయకులు, కుల సంఘ పెద్దలు హాజరవుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలలో సీట్ల సాధనకై ఈ సభ జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గడ్డం జగన్నాథం బొల్ల శివ, ఎర్రమాద వెంకన్న నేత, అవ్వారి భాస్కర్ , వనం దుశ్శాంతల , నరేందర్ , పద్మశాలి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *