NewsPoliticsViral

రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కుల గణన వెంటనే చేపట్టాలి – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు బిసి సంక్షేమ సంఘం.

రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కుల గణన వెంటనే చేపట్టాలి – గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు బిసి సంక్షేమ సంఘం.

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

హైదరాబాద్, డిసెంబర్ 07 : రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కుల గణన వెంటనే చేపట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. జనాభా గణన వివరాలను 15 రోజుల్లోగా కంప్యూటరీకరించాలన్నారు. ఈ మేరకు గురువారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ద్వారా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలన్నారు. అందుకు అన్ని ప్రభుత్వ శాఖలు ఈ కమీషన్ల నియంత్రణలో పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనవరిలో జరిగే సర్పంచ్, జెడ్పీటీసీ, మండల, స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక తరగతుల రిజర్వేషన్లకు ఈ కుల గణనను ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. రిజర్వేషన్లను కనీసం 50 శాతం పెంచాలన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీ కులాల జనాభా గణన జాతీయ స్థాయిలో ఓబీసీల హృదయాలను గెలుచుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది జాతీయ రాజకీయాలపై పెను ప్రభావం చూపుతుందన్నారు. ఉద్యోగాల భర్తీకి నియోజకవర్గాల వారీగా ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అసమానతలు తగ్గుతాయన్నారు.

అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు నియోజకవర్గం నిర్దిష్ట వర్గం వారీగా చేయడం అవసరం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం పక్కా భవనాలు నిర్మించాలన్నారు. తెలంగాణ ప్రగతి భవన్ ను మహాత్మ జ్యోతిబాపూలే భవన్ గా మార్చుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం అన్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌటుపల్లి సురేశ్, తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, గ్రేటర్ ఉపాధ్యక్షుడు పండరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *