NewsPolitics

అర్హత లేని కులాలను ఓబీసీ జాబితాలో చేర్చొద్దు – గుజ్జ సత్యం బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు

దేశ వ్యాప్తంగా 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని జాతీయ కమిషన్ వెనక్కి తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. దేశంలోని బీసీలకు జాతీయ బీసీ కమిషన్ తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర జాబితాలో ఉండి, కేంద్ర జాబితాలో లేని కులాలను కలిపితే ఎవరికీ, ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అర్హత లేని కులాలను ఓబీసీ జాబితాలో కలపడం సమంజసం కాదని పేర్కొన్నారు. అదే జరిగితే బీసీల ఆగ్రహాన్ని బిజెపి ప్రభుత్వం త్వరలోనే చూస్తుందని హెచ్చరించారు.

దేశ వ్యాప్తంగా బీసీలకు ఎలాంటి పథకాలు అమలులో లేవన్నారు. 2023-24 కేంద్ర బడ్జెట్లో ఓబీసీలకు కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించడం బీసీలపై కేంద్రానికి ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని మండిపడ్డారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడంతో పాటు వెంటనే కులగణన చేపట్టాలని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో బిజెపికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *