Devotional

నైమిశారణ్య ప్రవేశం సమస్త పాతక నాశనం..తెలుసుకోండి

నైమిశారణ్య ప్రవేశం సమస్త పాతక నాశనం..తెలుసుకోండి

ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్ జిల్లాలో నైమిశారణ్య క్షేత్రం ఉంది.

నైమిశారణ్య ప్రవేశం సమస్త పాతక నాశనం అని కూర్మపురాణం. నైమిశారణ్య క్షేత్రం గురించి చెప్పాలంటే సూక్ష్మంగా (పూజ్య గురువులు తమ ప్రవచనంలో వివరంగా చెప్పారు) కలియొక్క ప్రభావం లేని ప్రదేశంకోసం మునులు, తాపసులు బ్రహ్మగారిని ప్రార్థించగా దర్భలతోచేసిన చక్రాన్ని బ్రహ్మగారు వదిలారు ఆ చక్రం అంతటా తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉండగా దానికున్న నిమి ఊడి చక్రం పడిపోయింది అందువలన ఇది నిమి పడిన క్షేత్రం కాబట్టి నైమిశారణ్యం అయ్యింది. అంటే పుట్టడం-మరణం-పుట్టడం-మరణం-పుట్టడం అనే చక్రం ఆగి పునరావృత్తి రహిత శాశ్వత మోక్ష సిద్ధి కలగడానికి ఈ జనన మరణ ఆవృత్తి ఆగిపోవాలంటే సంసారమనే నిమి పడిపోయే ప్రదేశమే నైమిశారణ్యం. నైమిశారణ్యంలో ప్రవేశించిన సాధకులకు భగవత్కృప వలన, సద్గురు వచనం శాస్త్ర వచనం ఆకళింపు చేసుకున్నంత సంసారంలో ఉన్నా సంసారం అంటనివ్వని ప్రదేశమే నైమిశారణ్యం.

అప్పట్నుంచీ ఇక్కడ ఎన్నో వేల మంది ఋషులు, తాపసులు, వారి శిష్యగణాలతో వసించి తపస్యాదులు చేసుకొన్న క్షేత్రం గొప్ప తపోభూమి. మనోలయం తొందరగా కాగలిగిన క్షేత్రం. అందుచేతనే ఇక్కడ కొన్ని రోజులుండి అతి ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఏళ్ళనుంచీ తాపసులు తపస్సు చేస్తున్నారా అన్నట్లుండే పెద్ద పెద్ద కైవారంతో ఉన్న దేవతా వృక్షాలు, గోమతీ నది, శ్రీ చక్ర తీర్థం ఇత్యాది ఎన్నో గొప్ప గొప్ప విశేషాలతో ఉన్న ప్రదేశం గొప్ప సాధనా క్షేత్రం. ఏదో చూసి వెళ్ళిపోదాం అనుక్కునేలాటి క్షేత్రం మాత్రం కాదు.
ఐనా సరే, ఒక్కసారి ఇందులో ప్రవేశిస్తే చాలు “రుజో హరం యస్య రజా పవిత్రం తేజోమయం యస్య తమసా పురస్తాత్…” నైమిశారణ్యంలోని రజస్సు (ధూళి, మన్ను, మట్టి) తాకగానే సకల పాపాలు హరించుకుపోతాయట, చక్రతీర్థంలో స్నానం చేసిన భక్తులు, అక్కడి జానపదులు తడిబట్టలతో అడుగడుగు దండాలు పెడుతూ చక్రతీర్తానికి ప్రదక్షిణ చేస్తుంటారు… నైమిశారణ్య క్షేత్రానికి కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ లాగ చేస్తారు కానీ అడవి ప్రాంతం కావడం మూలాన అక్కడి వారే చేస్తూంటారు, సింహాచల క్షేత్రప్రదక్షిణోత్సవంలాగా నైమిశారణ్యంలో ఏటా ఫాల్గుణ శుక్ల పంచమి నాడు చేస్తారని అక్కడి వారు చెప్పారు. సనాతన ధర్మంలో చరించే ప్రతి ఒక్కరూ నైమిశారణ్య క్షేత్రానికి వచ్చి చక్ర తీర్థంలో మునకలు వేయవలసిందే, చక్ర స్నానం చేసి ఒడ్డున ఉన్న యజ్ఞవరాహస్వామిని దర్శించాలి అందువల్ల అపార పాప హరం, కలిదోష హరం, యజ్ఞఫలితమూ కలుగుతాయని పెద్దల వాక్కు. ఈ దివ్య ధామానికి వచ్చి ప్రతి ఒక్కరూ కనీసంలో కనీసం ఒకరోజైనా నిద్ర చేసి అనుష్ఠానాదులు చేసుకొని, ప్రత్యేక దీక్షలు, మంత్రాలు ఉంటే ఇక్కడ సాధన చేసుకోవలసిందే ఎందుకంటే ఇది సిద్ధ క్షేత్రం. అందుకే వ్యాసులు కలి స్సాధుః అన్నారు ఇందువల్లనే కదా మనకి నైమిశారణ్యమనే గొప్ప క్షేత్రం దొరికింది.
గోస్వామి తులసీదాసు గారి మాటలలో “తీర్థ వర నైమిశ్ విఖ్యాతా! అతి పునీత్ సాధక్ సిద్ధిధాతా!!” అని అన్నారు. భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలూ క్షేత్రాలుకలిసి పెళ్ళివారి ఊరేగింపుగా కదిలి వస్తే అందులో ముఖ్యమైనదీ మధ్యలో ఉండి అందరూ చూడాలనుక్కునేదీ ఐన వరుని స్థానంలో ఉండేది నైమిశారణ్యం. ఇది అతి పునీతమైనది సమస్త సాధకులకీ సిద్ధినొనరించే క్షేత్రముగా విరాజిల్లుతోంది.

వ్యాస, శుక, సూత, శౌనకాది మహర్షులు 88వేల మంది వారి వారి శిష్యగణాలు, అందులో శౌనకాదులు కులపతులు (11 వేల మంది శిష్యులను పోషిస్తూ వేదవేదాంగాలను బోధించేవారిని కులపతి అంటారు) దీర్ఘ సత్ర యాగం (1000 సంవత్సరాలు) చేసిన స్థలం అందునా యాగం జరిగిన చోట అన్ని వేల మందికీ అన్నదానం జరిగిన ప్రదేశం. అంత గొప్ప గొప్ప మునులు మహర్షులు, రాజర్షులు నడయాడిన ప్రదేశం దేవతలు మెచ్చి దర్శనమిచ్చే ప్రదేశం నైమిశారణ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *