News

కుల గణన చేయకుంటే భాజపాకు ఇవే చివరి ఎన్నికలు – గుజ్జ సత్యం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు…

మే 30 : ప్రతి పదేళ్లకు ఓసారి జరిగే జనగణన(సెన్సస్) 2020లో జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారని, అయితే ఈ వచ్చే ఏప్రిల్-మే మధ్యలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆలోపు జనగణన ఇక లేనట్లేనని కేంద్ర ప్రభుత్వవర్గాలు తాజాగా వెల్లడించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూబీసీ కుల గణన చేయ కుంటే దేశంలో భాజపాకు ఇవే చివరి ఎన్నికలని, మరో మహా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీ బీసీ వర్గానికి చెందినప్పటికీ, బీసీలకు ఏమీ చేయలేదన్నారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లు ఊసే లేదని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖకు అతీగతీ లేదని విమర్శించారు. సెన్సస్ జరిగినప్పుడు మాత్రం అందులో కొత్తగా స్మార్ట్ఫోన్ వివరాలు, ఇంటర్నెట్, ల్యాప్టాప్, కంప్యూటర్లు, కార్లు, ద్విచక్రవాహనాలు, ప్రధాన ఆహారం వంటి 31 ప్రశ్నలకు అధికారులు సమాధానాల్ని సేకరించనున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సెన్సస్ నిర్వహించాల్సి ఉన్నప్పటికి కరోనా వల్ల వాయిదా వేశారని చెప్పారు. కొత్త షెడ్యూల్ ను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉందన్నారు. పాలనపరమైన పరిధులు, కొత్త జిల్లాల లెక్కలవంటి వాటిపై తుది నిర్ణయానికి వచ్చే తేదీని ఈ ఏడాది జూన్ 30 గా రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం జనవరిలో స్పష్టం చేసిందన్నారు.

సాధారణంగా ఆ తేదీ ప్రకటించిన మూడు నెలలకు గానీ సెన్సస్ను ప్రారంభించటం కుదరదని, అంటే ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ సాధ్యం కాదని తెలిపారు. ఆ తర్వాత జనగణన నిర్వహించే 30 లక్షలమంది ఉద్యోగుల శిక్షణకు కనీసం మరో రెండు లేదా మూడు నెలల కాలం పడుతుందని పేర్కొన్నారు. ఆ సమయానికి సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రక్రియ మొదలై పోతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *