News

కొత్త జిల్లాలతో ప్రజల చెంతకే పాలన

కొత్త జిల్లాలతో ప్రజల చెంతకే పాలన

-అదేస్ఫూర్తితో నూతన పంచాయతీరాజ్ చట్టం
-కొత్తగా ఐదు వేల పంచాయతీలు.. 15 నుంచి 20 మున్సిపాలిటీలు
-2024నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లు
-ఈ సమావేశాల్లోనే బిల్లు.. అందుకే అసెంబ్లీని ప్రొరోగ్ చేయలేదు
-పాలనావ్యవస్థ-సంస్కరణలపై చర్చలో సీఎం కేసీఆర్
-ఎంపీ స్థానాల సంఖ్య పెంచాలని కేంద్రానికి వినతి

పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల పునర్విభజించి పాలనను ప్రజల చెంతకు తీసుకెళ్లామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. కొత్తజిల్లాల స్ఫూర్తితో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి స్థానికసంస్థలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో పరిపాలన సంస్కరణలు- నూతన పాలనా వ్యవస్థపై లఘు చర్చలో సీఎం చంద్రశేఖర్‌రావు సభ్యులు ప్రస్తావించిన పలు అంశాలపై విపులంగా సమాధానాలిచ్చారు. ఐదు వేల కొత్త పంచాయతీలు, 15 నుంచి 20 మున్సిపాలిటీలతో కొత్త పంచాయతీరాజ్ చట్టం బిల్లును ఈ సమావేశాల్లోనే పాస్ చేస్తాం. అందుకే అసెంబ్లీని ప్రొరోగ్ చేయలేదు. పాత పంచాయతీ అయిన నిజాంపేటలో 6 నుంచి 7 అంతస్తుల వరకు నిర్మించుకునేందుకు అనుమతులిచ్చారు. రోడ్డు మాత్రం 18 ఫీట్లుగా ఉంది. అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? అందుకే కొత్త నిబంధనలతో పంచాయతీరాజ్ చట్టం తెస్తాం. అర్బన్ లోకల్ బాడీ(యూఎల్బీ), మున్సిపాలిటీలు, పంచాయతీలు ఏర్పాటు చేస్తాం. ఇపుడు 1300, 1400 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలున్నాయి. వాటి స్థానంలో 500 జనాభా ఉన్న ఆవాసాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటుచేస్తాం. ఈ సెషన్‌లోనే అందరి ఆమోదం పొందుతాం. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు పంచాయతీరాజ్ సెక్రటరీ లేఖలు రాశారు. అందరూ సూచనలు ఇవ్వాలి.

పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు అందించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు క్రియాశీలంగా ముందుకు సాగాలి. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి నేరుగా చెప్పా. నీతి ఆయోగ్ సమావేశంలో అభిప్రాయాలు క్షుణ్ణంగా చెప్పా. మిగతావారంతా ఇబ్బందిపడుతున్న సమయంలో..ప్రధానమంత్రిగారూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లన్నీ కలుపుకొంటే రూ.38 లక్షల కోట్లు ప్రతి ఏటా ఖర్చుచేస్తున్నాం. కానీ స్థానికసంస్థలకు పనిచేసే అవకాశం లేకపోతే, అవి సక్రమంగా సేవలందించకపోతే ఫలితం ఉండదని తెలిపా. పనిచేసే వేదికలకు నిధులు ఇవ్వాలని స్పష్టంచేశా. పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం సరిగా నిధులు అందించడం లేదనే మాటను బీజేఎల్పీ నేతగా కిషన్‌రెడ్డి అంగీకరించడం ఆహ్వానించదగ్గ పరిణామం. పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు, అధికారాలు ఇవ్వాలనే ప్రతిపాదనను సీరియస్‌గా అధ్యయనం చేస్తున్నాం. చట్టాల్లో లొసుగుల ఆధారంగా కొందరు కోర్టుకు వెళుతున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను మార్చేందుకు సభ్యులంతా సలహాలు, సూచనలు ఇవ్వాలి. గడువును అనుసరించే స్థానికసంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం పది జిల్లాలుగా జిల్లా పరిషత్‌ల పాలన సాగుతున్నది. రాబోయేకాలంలో హైదరాబాద్ మినహా 30 జిల్లాల జెడ్పీల పనితీరు బ్రహ్మాండంగా కొనసాగనున్నది. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2024 నాటికి రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంటుంది అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు.

ప్రజల డిమాండ్ల మేరకే కొత్త జిల్లాలు
దేశంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మినహా అన్నిరాష్ర్టాలు పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేసుకున్నాయని సీఎం కేసీఆర్ వివరించారు. జిల్లాలను పునర్విభజించుకునే కచ్చితమైన హక్కును రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉందని, ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదని స్పష్టంచేశారు. గతంలో సిద్దిపేట నుంచి జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి వెళ్లాలంటే ఆర్టీసీ బస్సుల్లో 6 నుంచి 7 గంటల సమయం పట్టేది. విద్యార్థిదశలో నేనూ ఇబ్బందులు ఎదుర్కొన్నా. గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దాదాపు 200 నుంచి 250 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ప్రజల ఆమోదం మేరకే 31 జిల్లాలను ఏర్పాటు చేశాం. మొదటగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో 24 జిల్లాలు ఉన్నమాట వాస్తవమే. తదనంతరం ప్రజల డిమాండ్లు, సలహాల మేరకు 31కి పెంచాం. హైదరాబాద్ నగరాన్ని విడదీయవద్దని అన్ని పార్టీలు చేసిన సూచన మేరకు వదిలేశాం. జిల్లాల ఏర్పాటులో జనాభాలోనూ వ్యత్యాసం ఉంటది. దేశవ్యాప్తంగా ఇలానే ఉంది. మేడ్చల్, రంగారెడ్డి, హైదారాబాద్ జిల్లాల్లో జనాభా భవిష్యత్‌లో మరింత పెరుగుతది. మళ్లీ రొటేషన్ ప్రకారంగా విభజన చేసుకునే వెసులుబాటు ఉంటది.
ఒక్కో ఎంపీ నియోజకవర్గం ఐదు జిల్లాల్లో, ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఒకట్రెండు జిల్లాల్లో ఉంటే నష్టమేం లేదు. జిల్లాల విభజనకు ముందు భువనగిరి, భద్రాచలం పార్లమెంట్ పరిధి ఐదు జిల్లాల్లో ఉండేది. నా గజ్వేల్ నియోజకవర్గం కూడా రెండు జిల్లాల్లో, రెండు రెవెన్యూ డివిజన్లతో ఉన్నది. అక్కడ ఉన్న జనాభా, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాం.. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. నియోజకవర్గాల పరిధి రెండు మూడు జిల్లాల్లో ఉంటే నష్టమేంది? ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఎక్కువ నిధులు తెప్పించుకొని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. 2019 ఎన్నికల నాటికి పరిపూర్ణంగా ఏ జిల్లాకు ఆ జిల్లా సిద్ధమవుతుంది. రాష్ట్రంలో 10 జిల్లాలు ఉంటే కొత్తగా 21 జిల్లాలతో 31కి పెంచాం. పాత రెవెన్యూ డివిజన్లు 43 ఉంటే కొత్తగా 25 ఏర్పాటుచేసి మొత్తం 68కి పెంచాం.459 పాత మండలాలకు కొత్తగా 125 మండలాలను ఏర్పాటుచేశాం. నాలుగు పోలీస్ కమిషనరేట్లు ఉంటే కొత్తగా మరో ఐదు ఏర్పాటుచేశాం. 139 పోలీస్ సబ్‌డివిజన్లకు కొత్తగా 23 ఏర్పాటుచేయగా మొత్తం 162 పనిచేస్తున్నాయి. 712 పోలీస్ స్టేషన్లు ఉంటే కొత్తగా 102 ఏర్పాటు చేయగా ప్రస్తుతం 814 పోలీస్ స్టేషన్లు ప్రజలకు సేవంలందిస్తూ, శాంతిభద్రతలను కాపాడుతున్నాయి అని సీఎం కేసీఆర్ వివరించారు.

కాంగ్రెస్, బీజేపీ వ్యాఖ్యలకు ఘాటు సమాధానం
జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్ తరుఫున చేసిన ప్రస్తావనపై సీఎం కేసీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. 120 ఏండ్ల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ ఏదైనా మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకుని, పెద్దల సమాచారంతో మాట్లాడాలని కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్‌కు చురకలంటించారు. జిల్లాల ఏర్పాటు అంశం, కేంద్రంతో సంబంధం లేనిదని.. రాష్ట్ర ప్రభుత్వానికే హక్కు ఉంటుందని చెఉప్పారు. రాష్ట్రంలో 31 జిల్లాలకు సంబంధించి కేంద్ర పరిధిలోని అన్ని ప్రభుత్వశాఖలకు, మంత్రులకు, ప్రధాని మోదీకి కూడా గెజిట్ నోటిఫికేషన్లను పంపించామని, వారంతా నోటిఫై చేశారని చెప్పారు. ఎన్‌ఐసీ గుర్తించిందని, ఆర్‌బీఐ కూడా లీడ్ బ్యాంకులు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా తెలంగాణకు సంబంధించి 31 జిల్లాలను పేర్కొన్నదని, ఎవరికీ అనుమానం అక్కర్లేదని చెప్పారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఉత్సవ విగ్రహాలుగా మార్చుతున్నారన్న బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. నరేగా కార్యక్రమాన్ని పంచాయతీలకు, మండల్ పరిషత్‌కు, జిల్లా పరిషత్‌లకు అనుసంధానం చేయాలని ప్రధానికి అరడజను సార్లు లెటర్లు రాశామని గుర్తుచేశారు. మంత్రి పోచారం డజనుసార్లు కేంద్ర వ్యవసాయశాఖకు లేఖలు రాశారని తెలిపారు. సంస్కరణలు ఒక్కరోజుతో ఆగవని, నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని స్పష్టంచేశారు.

పదినెలల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం
రాష్ట్రంలో రూ. 1337 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. డీపీవో, కమిషనరేట్లు, కలెక్టరేట్లు నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించాం. హైదరాబాద్‌లో ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం భవనం ఇప్పటికే 12 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. మరో 10 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పనితీరును ఇక్కడి నుంచే వీక్షించవచ్చు. ప్రకృతి వైపరీత్యాలను కూడా ఇక్కడి నుంచే వీక్షించే అవకాశం ఉంది. పాలనాపరంగా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తితే సరిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నాం.. ఉద్యోగాల భర్తీ, ఇంచార్జీలతో పాలనపై త్వరలో చర్యలు తీసుకుని కిందిస్థాయిలో పాలనను మెరుగుపరుస్తాం. ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్‌ల విభజన చేయాలని కేంద్రానికి విన్నవించాం. ఉమ్మడిరాష్ట్రంలో ఉన్న జోనల్ సిస్టంను కొనసాగిస్తాం. జోనల్ విధానంపై మంత్రి కడియం ఆధ్వర్యంలో కమిటీ వేశాం. సర్వజన ఆమోదంతో ముందుకు సాగుదాంఅని సీఎం కేసీఆర్ చెప్పారు.

జనాభా పెరిగినా ఎంపీల సంఖ్య పెంచరా?
యూపీఏ హయాంలో కేంద్రంలో మంత్రిగా పనిచేసినప్పుడు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని పరిశీలించే బాధ్యతను సోనియాగాంధీ తనకు అప్పగించారని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రపంచ దేశాల్లో పార్లమెంట్ పరిధిలో ఉన్న జనాభాపై కూడా అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చాం. 32 కోట్ల జనాభా ఉన్నప్పుడు చేసిన పార్లమెంట్ సభ్యుల సంఖ్యను ఇపుడున్న 130 కోట్ల జనాభాకు కొనసాగిస్తున్నాం. 70 ఏళ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వానికి పరిపక్వత రాలేదు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు 30 లక్షల జనాభా ఉన్నది. అయినా మార్పులు చేస్తలేరు. ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన బాధ్యత కేంద్రం, పార్లమెంట్, ఎలక్షన్ కమిషన్‌దే. ఎందుకు దీనిపై దృష్టి పెడుతలేరో అర్థం కావడం లేదు. ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని ఇక్కడి నుంచే కేంద్రానికి అప్పీల్ చేస్తున్నాఅని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *