Health

ఈ విషయాలు తెలిస్తే గర్భిణీ స్త్రీలు నివ్వెరపోతారు ?

స్త్రీ యొక్క మానసిక స్థితి ప్రభావం ఆమె గర్భంలోని పిండంపై పడుతుందనే ఆధునిక సిద్ధాంతం ఒకటి ఉంది. ఇటువంటి కొన్ని సిద్ధాంతాలకు మూలపురుషునిగా విదేశీ శాస్త్రవేత్త “ఫ్రాయిడ్” ను చెప్పుకుంటాం. ఐతే, పైన తెలిపిన సిద్ధాంతం మిగతా ప్రపంచదేశాలకు క్రొత్తేమో గాని, మన భరతఖండానికి మాత్రం క్రొత్తకాదు.

మానసిక పరిస్థితులను బట్టి శారీరక పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తాయని మన ప్రాచీన ఋషులు, పురాణకర్తలు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. స్త్రీ మానసికస్థితి ప్రభావం ఆమె గర్భంలోని శిశువుపై పడుతుందని పురాణాల్లో అనేకచోట్ల నిరూపించబడింది. కాబట్టి, ఈ సిద్ధాంతాన్ని “ఫ్రాయిడ్ సిద్ధాంతం” అనేకంటే “ఒక హైందవ సిద్ధాంతం” అని చెప్పుకుంటే బాగుంటుంది. ఈ సిద్ధాంత ప్రకారం మన హైందవులకు ఎన్నో ఆచార వ్యవహారాలు ఏర్పడ్డాయి.

పై సిద్ధాంతాన్ని నిరూపిస్తూ మన పురాణాల్లో ఉన్న కొన్ని సంఘటనలను చూద్దాం ఇప్పుడు.

కశ్యప ప్రజాపతి తన భార్యలను “మీకెలాంటి బిడ్డలు కావాలి?” అని అడిగేవాడట. వారు చెప్పేవారట. వారు కోరినదాన్ని బట్టి ఆచరించవలసిన వ్యవహారాలను తెలిపి, వాటి ఆచరణ అనంతరం వారితో సంగమించేవాడట. ఆ ప్రకారంగా కోరిన బిడ్డలు కలిగేవారట.

అలాగే “మహాభారతము” లోని సంగతి. అంబికతో, అంబాలికతో, అంబిక యొక్క దాసితో సంగమించిన వ్యాసమహర్షి – వారికి తనవల్ల ఎలాంటి బిడ్డలు పుడతారో ముందుగానే చెప్పేశాడు. అది అక్షరాలా నిజమయింది. ఈ సందర్భంలో ఆయన తన మహిమనేమీ ఉపయోగించలేదు. సంగమ సమయములో స్త్రీయొక్క మనఃస్థితి ప్రభావం, వీర్య అండముల కలయిక అయిన పిండంపై పడుతుంది.

ఈ విజ్ఞాన విషయం ఆధారంగా వ్యాసమహర్షి పై సంగతి చెప్పగలిగాడు. సంగమించే సమయములో వ్యాసుని రూపానికి భయపడిన అంబిక కళ్ళు మూసేసుకుంది. సంగమ అనంతరం వ్యాసుడు ఆమెకు కలగబోయే బిడ్డను గురించి చెప్తూ “ఈమెకు మహా బలవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. ఐతే, భయంతో కళ్ళు మూసుకుని ఉండిపోయిన మాతృదోషం వల్ల పుట్టే బిడ్డ పుట్టుగ్రుడ్డివాడై ఉంటాడు” అని అన్నాడు. వ్యాసుడు చెప్పినట్లే జరిగింది. అంబికకు పుట్టుగ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు.

ఇక, పాండురాజు తల్లి అయిన అంబాలిక సంగతి! సంగమ సమయములో వ్యాసుని వికారరూపానికి ఆమె తెల్లబోయింది. అది గమనించిన వ్యాసుడు, ఆమెతో సంగమించిన అనంతరం ఆమెకు కలగబోయే సంతానం గురించి చెప్తూ “ఈమెకు బలవంతుడూ, పరాక్రమవంతుడూ, రూపవంతుడూ అయిన కుమారుడు జన్మిస్తాడు. కాని, సంగమ సమయములో తల్లి దోషం వల్ల పాండుదేహం వాడుగా అవుతాడు” అని అన్నాడు. అలాగే పాండురాజు పాండువర్ణముతో పుట్టాడు. అంబిక యొక్క దాసి మాత్రం నిశ్చలమైన నిండుమనసుతో వ్యాసుణ్ణి కలిసింది. ఆమెకు “తేజోవంతుడూ, ధర్మనిష్ఠాపరుడూ, శాంతిస్వరూపుడూ అయిన బిడ్డ కలుగుతాడు” అని వ్యాసుడు చెప్పాడు. ఆ విధంగానే ఆమెకు ధర్మపరుడైన విదురుడు జన్మించాడు. ఈ మూడు సందర్భాల్లోనూ కూడా ఖచ్చితంగా కుమారులే పుడతారని వ్యాసమహర్షి చెప్పడాన్ని గమనించండి.

పుట్టబోయే బిడ్డ యొక్క లింగ నిర్ధారణ :

పుట్టబోయే బిడ్డ యొక్క లింగనిర్ధారణ కూడా ముందుగానే చేయడం వ్యాసుని గొప్పదనం. సంగమం జరిగిన వెంటనే ఆయన ఆ విషయాన్ని నిర్ధారణగా చెప్పగలిగాడు. ఈ రోజుల్లోనూ పుట్టబోయే బిడ్డ యొక్క లింగనిర్ధారణ చేస్తున్నారు. ఐతే, గర్భంలోని శిశువు కొన్నాళ్ళు ఎదిగిన తర్వాత మాత్రమే ‘ ఆడ ‘ లేక ‘ మగ ‘ అనేది చెప్పగలుగుతున్నారు. వ్యాసుని మేధస్సు కంటే ఆధునికసైన్సు చాలా వెనుకబడి ఉందన్నమాట. పుట్టబోయేది ఆడబిడ్డా, మగబిడ్డా అనే విషయం, సంగమం జరిగిన వెంటనే చెప్పగల శక్తి ఆనాటి విజ్ఞానులకుంది. వారి సైన్సు పద్ధతులూ, శక్తీ అటువంటివి. సంగమం జరిగిన అనంతరం కొన్ని పద్ధతులను అవలంబించడం ద్వారా లింగనిర్ధారణ మన చేతుల్లో ఉన్నదని కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి. పుట్టబోయే బిడ్డయొక్క లింగనిర్ధారణ చేయగలిగే విధానాలు నేటికీ కోణార్క లోని సూర్యదేవాలయంపై వ్రాయబడి ఉన్నాయి. వెళ్ళి చూడవచ్చు.

ఈసారి మరో విషయం చూద్దాం. అర్జునుడు చెప్తూండగా సుభద్ర గర్భంలోని అభిమన్యుడు “పద్మవ్యూహ రచన” వినడం కేవలం కథాలంకార విశేషం. నిజానికి సుభద్ర సగం వరకు వ్యూహరచన విన్నది. ఆ ప్రభావం గర్భస్థశిశువైన అభిమన్యునికి అంటింది. సుభద్ర నిద్రలోకి జారగానే, మిగిలిన వ్యూహరచన అభిమన్యునికి చేరలేదు.

అలాగే, హిరణ్యకశిపుని భార్య లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదునికి నారదుడు “హరిభక్తి” ని ఉపదేశించడం కథాలంకారమే! నిజానికి నారదుడు లీలావతికే హరిభక్తిని ఉపదేశించాడు. ఐతే, ఆ ఉపదేశ ప్రభావం ఆమె గర్భంలో వున్న ప్రహ్లాదునిపై పడింది. దానితో అతడు హరిభక్తునిగా జన్మించాడు.

“మహాభారతము” లోనున్న అష్టావక్రుని కథ కూడా ఈ కోవకు చెందినదే! అష్టావక్రుని తండ్రి ఏకపాదుడు. ఆయన మహా విద్వాంసుడు. శిష్యుల చేత ఎప్పుడూ వేదాలను చదివిస్తుండేవాడు. ఏకపాదుని భార్య సుజాత. ఆమె గర్భంలో అష్టావక్రుడు ఉండగా ఒక చిత్రం జరిగింది. ఏకపాదుడు తన శిష్యులకు పగలూ, రాత్రీ విరామం లేకుండా పాఠాలను చెప్పడాన్ని తల్లి గర్భంలో నుండే గమనించాడట అష్టావక్రుడు.

తండ్రి పద్ధతి నచ్చక ఆయన్ని ఉద్దేశించి “శిష్యులచే రేయింబవళ్ళు చదివించడమేనా? నిద్రా అదీ లేక వారు మందమతులౌతున్నారు. ఏం చదువుతున్నారో వారికే తెలియకుండా ఉంది. ఏం చదువిది?” అని ఆక్షేపించాడట. ఆ విధంగా గర్భస్థశిశువు తనను ఆక్షేపించడంతో ఏకపాదునికి ఆగ్రహం కలిగింది. “వేదాధ్యయనానికి వంకలు పలుకుతున్నావు. అందుచేత అష్ట (8) వంకరలతో పుడతావు” అంటూ కొడుకును శపించాడు. ఫలితంగా అష్టవంకరలతో పుట్టిన ఆ శిశువుకు “అష్టావక్రుడు” అనే నామం స్థిరపడింది. ఇదీ అష్టావక్రుని కథ.

ఐతే, దీనిలో అంతర్లీనంగా ఇమిడివున్న విశేషాంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. నిజానికి శిష్యుల ప్రయాస చూసి బాధపడిన వ్యక్తి సుజాత. అంతేగాని, ఆమె గర్భంలోని శిశువు కాదు. సరైన నిద్ర కూడా లేక మందమతులౌతున్న శిష్యగణం వేదాలు సరిగా చదవలేకపోవడం చూసి ఆమె మనసు వికలత్వం చెందినది. ఆమెకు కలిగిన ఆ మనోవికలత్వం గర్భస్థశిశువును దెబ్బతీసింది. ఆ కారణంగా శిశువుకు శారీరక వైకల్యం ప్రాప్తించింది. ఈ కథలో అంతర్లీనంగా ఉన్న యధార్థం ఇది. గర్భస్థశిశువు తండ్రితో మాట్లాడ్డం, ఆయన కోపించి శపించడం…….ఇవన్నీ వ్యాసమహర్షి చమత్కారాలు. తల్లి ఆలోచనాసరళి ప్రభావం గర్భస్థశిశువుపై పడుతుందనే ఫ్రాయిడ్ సిద్ధాంతం, ఏనాటిదో అయిన ఈ గాథలో కనిపిస్తుంది చూడండి.

గర్భవతి అయిన సుభద్ర వీరగాథలు వినడంవల్ల, వ్యూహరచనలు వినడంవల్ల ఆమెకు మహావీరుడైన అభిమన్యుడు పుట్టాడు. గర్భవతిగా ఉన్నప్పుడు లీలావతి సేవించిన భక్తిరసం వల్ల ఆమె బిడ్డ ప్రహ్లాదుడు మహాభక్తుడయ్యాడు. గర్భవతి అయిన అష్టావక్రుని తల్లి మనోవైకల్యం పొందిన కారణంగా, ఆమెకు పుట్టిన శిశువు అష్టవంకరలతో పుట్టాడు.

గర్భవతి మనోభావాలు శిశువుపై ప్రభావం చూపుతాయని పై విషయాల వల్ల తెలుస్తోంది. గర్భవతులు భక్తికథలు, వీరగాథలు వినాలనీ, చదవాలనీ, ఎల్లప్పుడూ అందమైన, ఆరోగ్యవంతమైన బిడ్డ తలంపుతో ఉండాలనీ, భయంకర వార్తలు, విషాదవార్తలు వినకూడదనీ, అలాంటి దృశ్యాలు చూడరాదనీ అంటారు. ఆధునిక వైద్యులు కూడా వీటిని ధృవీకరిస్తున్నారు.

ఈ విషయాలనన్నింటినీ మన పూర్వీకులు కొన్ని ఆచార వ్యవహారాలుగా మలిచారు. గర్భవతులు గ్రహణాలు చూడరాదనీ, కూరగాయలు తరగరాదనీ కూడా మనవాళ్ళు అంటూంటారు. ఎందువల్లనంటే, ఆకారములో తరుగుదల కనిపించే సూర్యచంద్రులూ, కూరగాయలూ ఆమె మనోస్థితిలో మార్పు తేగలవేమోనని పెద్దలు భావించి ఉంటారు. ‘ ఇప్పట్లో బిడ్డలు వద్దు ‘ అనుకునే దంపతులు (ముఖ్యంగా భార్య) సంభోగసమయములో గానీ, ముందుగానీ, లేదా తర్వాతగానీ చంటిపిల్లలను చూడరాదనే సాంప్రదాయం ఉంది. దీనికీ పై సిద్ధాంతమే కారణం.

గర్బంలో రూపు దిద్దుకుంటున్న బిడ్డ యొక్క అందం, ఆరోగ్యం, గుణం, ధైర్యం, విజ్ఞానం, వీరత్వం…….ఇలాంటి ఎన్నో విషయాలు తల్లి మనోగత పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయని ఆధునిక సైన్స్ చెప్తోంది. ఈ సూత్ర ప్రకారమే కశ్యపుడు, వ్యాసుడు తమ ద్వారా కలగబోయే బిడ్డల స్థితిగతులను ముందుగానే చెప్పగలిగారు.

కెనడాకు చెందిన ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త డాక్టర్ థామస్ వెర్నే పైన తెలిపిన మన ప్రాచీన విజ్ఞాన విషయాలకు అనుకూలమైన అభిప్రాయాలతో “The Secrets of Unborn Child” అనే గ్రంథాన్ని ఇటీవలే వ్రాశాడు.

మన పూర్వీకులకు తెలిసిన “పాత విజ్ఞానాన్నే”, విదేశీయులచే “క్రొత్త విజ్ఞానం” గా చెప్పించుకుంటున్నాం మనం! అదీ అసలు సంగతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *