News

కేసీఆర్ పాలన రికార్డ్‌ కాలం కొనసాగాలి

కేసీఆర్ పాలన రికార్డ్‌ కాలం కొనసాగాలి

-నేను సీఎం కావడం అనేది ప్రచారం మాత్రమే

-మంత్రిని అవుతాననుకోలేదు.. ఇదే నా స్థాయికి ఎక్కువ

-గత పాలకుల వైఫల్యం వల్లే హైదరాబాద్ దుస్థితి

-కోదండరాం కొట్లాట ఆయనకు కొలువు కోసమే

-బీబీసీ-తెలుగు ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలన రికార్డుకాలం కొనసాగాలని కోరుకుంటున్నానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కేసీఆర్ ఎప్పుడో ఒకప్పుడు తనను సీఎం చేస్తారనేది కొందరి ప్రచారమేనని తేల్చిచెప్పారు. నాకు అలాంటి లక్ష్యాలు లేవు. ఎజెండాలూ లేవు. మంత్రి అవుతానని అనుకోలేదు. ఇదే నా స్థాయికి ఎక్కువ. నాకంటే తెలివైన వారు వేలమంది ఉన్నారు. బెంగాల్ సీఎంగా జ్యోతిబసు రికార్డును కేసీఆర్ బద్దలుకొట్టాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ చిటికెన వేలికి సరిపోయే నేతలు లేరు అన్నారు. బీబీసీ తెలుగు చానల్‌కు ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు. ఒకరి కొడుకు, కూతురు అనేది కేవలం ఎంట్రీ పాస్ వరకే పనికొస్తుందని చెప్పారు. సిరిసిల్లలో మూడుసార్లు గెలిచాను. నా పనితీరు బాగాలేకుంటే ఫలితం వేరేలా ఉంటుంది. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌కూడా ఓడిపోయారు. వారికంటే ప్రజాకర్షక నేతలు లేరు. కాబట్టి సామర్థ్యమే గీటురాయి అని స్పష్టంచేశారు. రాబోయే ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనేనని అన్నారు. బీజేపీ ఇప్పుడున్న సీట్లు నిలబెట్టుకుంటే గొప్పేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడితే పెట్టుబడులురావు.. హైదరాబాద్‌లో ఎవరూ ఉండరు.. అని ప్రచారంచేశారు. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందని అంటున్నారు. కొత్తరాష్ట్రం అయినా రాజకీయ స్థిరత్వంతో దేశంలోనే వృద్ధిరేటులో

ప్రథమస్థానంలో ఉన్నాం అని చెప్పారు.

ఏడెనిమిది దశల్లో హైదరాబాద్ అభివృద్ధి

హైదరాబాద్ రోడ్ల స్థితిగతులపై వాస్తవ అవగాహనతో మాట్లాడాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులు విఫలయ్యారని చెప్పారు. విశ్వనగరం అన్నారు.. కానీ ఏం అభివృద్ధి జరుగలేదు.. అంటూ జోకులు వేస్తున్నారు. ఏడెనిమిది దశల్లో ఈ అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం. దీర్ఘకాలిక విప్లవాలకు సమయం పడుతుంది అని స్పష్టంచేశారు. హైదరాబాద్ అభివృద్ధికి వ్యక్తుల ముద్ర వేయడం సరైంది కాదని కేటీఆర్ అన్నారు. ఐటీరంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న బెంగళూరుకు ఆ హోదాను ఎవరు తెచ్చారు? అక్కడ సీఎం, మంత్రి పేరు ఎక్కడైనా ప్రచారమైందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నిజంగానే గొప్ప వ్యక్తి అయి ఉంటే మీడియా అంత ప్రచారం చేసినప్పటికీ 2004లో హైదరాబాద్‌లో ఎందుకు ఓడిపోయారు? అందులో హైటెక్‌సిటీ ఉన్న శేరిలింగపల్లిలో కూడా టీడీపీ ఓటమి పాలైంది.

హైదరాబాద్‌కు ఉన్న సహజ అనుకూలత వల్ల అభివృద్ధి జరిగింది తప్ప.. ఎన్టీఆర్, చంద్రబాబువల్ల అంటే ఒప్పుకోను. రేపు కేసీఆర్ కూడా కాదు అని మంత్రి కేటీఆర్ వివరించారు. ఉస్మానియా వర్సిటీలో వాతావరణం టీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా మారుతున్నదన్న వాదనను కేటీఆర్ కొట్టిపారేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినట్టు ఆధారాలతో చూపిస్తే.. ఇక్కడికక్కడే రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఓ కండక్టరుకు నోటీసులు ఇవ్వడంపై సర్కారులో ఉంటూ అందులోనే పొక్కలు పొడుస్తుంటే ఇలాంటి నిర్ణయం కాకుండా ఇంకేది తీసుకుంటారు? అని ఎదురు ప్రశ్నించారు. కేసీఆర్‌కు కోదండరాం సమఉజ్జీ కాదని అన్నారు. కొలువులు ఎక్కడిది? కొట్లాట ఎక్కడిది? ఆయనకో ఉద్యోగం కావాలని కొట్లాట అని వ్యాఖ్యానించారు.

వీకెండ్లు పెద్దగా లేవు..

వీకెండ్లు పెద్దగా ఏం లేవు.. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పోయి వర్క్ మాత్రమే మిగిలింది. మంత్రిని కాకపోయుంటే ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని అని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ ఆధ్యాత్మికవాది కాదని అంటుంటారు. ఎవరి నమ్మకాలు వారివి. ఇతరుల మనోభావాలను గౌరవిస్తాను. కొన్నింట్లో సైంటిఫిక్‌గా ఉండటమే మేలని నా భావన అన్నారు. తమిళనాడులో ఏం జరుగుతుందో తనకు తెలియదు కాబట్టి కమల్‌హాసన్ రాజకీయరంగ ప్రవేశంపై వ్యాఖ్యానించడం సరికాదని చెప్పారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికతో ఏం జరుగనుందని సదరు జర్నలిస్టు ప్రస్తావించగా.. సముద్రాలు ఉప్పొంగి పోయి తెలంగాణకు వస్తాయి. రాహుల్‌గాంధీ అంతర్జాతీయ నేత, రేవంత్ జాతీయ నాయకుడు అవుతారని అంటున్నారు అని ఎద్దేవాచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *